బతకలేక ఎంతో మంది చస్తూ బతుకీడిస్తుంటే, ఇంకొందరు మాత్రం స్వయంకృతాపరాధంతో బతుకుల్ని బస్టాండ్‌గా చేసుకుంటున్నారు. క్షణికావేశాలతో కొందరు.. క్షణిక సుఖాల కోసం ఇంకొందరు తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా నిండు జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు డబ్బులు ఇవ్వలేదని ఓ కన్నకొడుకు బరితెగించాడు. ఏకంగా కన్న తల్లిని కాటికి పంపాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మాయమై పోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పదం అక్షర సత్యం అన్పిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే, మద్యం తాగడానికి పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లిని చెంపేశాడు కొడుకు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చల్మేటి దుర్గవ్వను(75) అర్ధరాత్రి కొడుకు రామచంద్రం డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె ప్రాణాలు తీశాడు.
కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రామచంద్రం డబ్బులు ఇవ్వాలని కన్న తల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో రెండు మూడు సార్లు డబ్బులు కూడా దొంగతనం చేశాడు. తాజాగా గురువారం(ఆగస్ట్ 8) రాత్రి ఫుల్ గా తాగి ఇంటికి వచ్చిన రామచంద్రం పెన్షన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకవడంతో అది మనసులో పెట్టుకొని దుర్గవ్వ నిద్రపోగానే ఆమె మెడకు చున్నీ చుట్టి హత్య చేశాడు. అందరితో కలివిడిగా ఉండే దుర్గవ్వ తెల్లవారేసరికి బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వెళ్లి చూడగా, విగతజీవిగా పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామచంద్రం కోసం గాలింపు చేపట్టారు. ఇక దుర్గవ్వ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.