AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

లిక్కర్ స్కామ్‌లో తనపై నమోదైన ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ జులై 1వ తేదీన ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన కవిత సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు విచారణ జాబితాలో లిస్ట్ అయ్యింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం ముందు కవిత పిటిషన్ లిస్ట్ అయింది. సోమవారం కవిత పిటిషన్‌పై వాదనలు జరగనుండగా.. సుప్రీం ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా, ఎమ్మెల్సీ కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు.

అంతకు ముందు ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కవిత జైల్లో చాలా ఇబ్బందు పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గారని, బీపీ పెరిగిందన్నారు. హై బీపీ కారణంగా రోజూ రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందన్నారు. దేశంలో పొలిటికల్‌గా కొట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవన్నారు. బెయిల్ కోసం అప్పీల్ చేశామని కేటీఆర్ చెప్పారు. వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ వచ్చినందున.. మిగతా వాళ్లకు కూడా వస్తుందని భావిస్తున్నామన్నారు. తీహార్ జైల్లో 11 వేల మంది ఖైదీలు ఉండాల్సిన చోట ఏకంగా 30 వేల మంది ఉన్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలు కూడా పరిశుభ్రంగా లేదన్నారు. జైలు కు వెళ్లి వచ్చిన వాళ్ళు భవిష్యత్‌లో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మనీష్ సిసోడియాకు బెయిల్..
ఢిల్లీ మద్యం కుంభకోణం ఈడీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.. సిసోడియాకు బెయిల్ ఇస్తూ శుక్రవారం నాడు తుది తీర్పునిచ్చారు. అయితే, పలు నిబంధనలు విధించారు. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని సిసోడియాను న్యాయమూర్తి ఆదేశించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10