ప్రాజెక్టు మీద బురదజల్లితే చరిత్ర హీనులే : కేటీఆర్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
సత్యమే ఎప్పటికీ గెలుస్తుందని, త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండు కుండలా మేడిగడ్డ బ్యారేజీ’ అంటూ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద వీడియోను పోస్టు చేశారు.
‘మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్దీ యూట్యూబ్ చానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ల కుళ్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెకుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. కేసీఆర్‌పై, కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం. జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.









