AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు

– నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు
– పరవళ్లు తొక్కుతోన్న బొగత జలపాతం
– ములుగు జిల్లాలో అత్యధికంగా 109 మి.మీ. వర్షపాతం నమోదు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోనే ఉంది. అయితే ఈ వారాంతంలో తెలంగాణ రికార్డు వర్షపాతం నమోదు అయ్యింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 109 మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ములుగు జిల్లాలో అత్యధికం..
ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 109 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లలో 96.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 40 నుంచి 80 మి.మీ. వర్షపాతం నమోదైంది.

కనువిందు చేస్తున్న బొగత..
బొగతా జలపాతం ఉప్పొంగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతానికి భారీగా వరద నీరు వస్తోంది. అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. ప్రమాదం పొంచి ఉండడంతో సందర్శకులను అధికారులు అనుమతించడం లేదు.

ANN TOP 10