(అమ్మన్యూస్,హైదరాబాద్):
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నియోజకవర్గంలో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిట్మెంట్ ఉన్న నాయకులకే రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వల్లే కేబినెట్ విస్తరణ వాయదా పడిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. మంత్రి మండలి విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాగా, రేవంత్ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మినిస్టర్ పోస్ట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. తనకు రాష్ట్ర హోం మంత్రి పదవి కావాలని పలుమార్లు బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సెగ్మెంట్‌కు ఇన్‌చార్జ్ గా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హై కమాండ్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయం కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేసి భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరడంలో కీలక పాత్ర పోషించాడు.