కౌన్సిలర్ల ఇంటి గోడలపై అతికించిన నోటీసులు
అమ్మన్యూస్ ప్రతినిధి, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం నేపథ్యంలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకుగాను వారిని శిబిరాలకు తరలించగా…అవిశ్వాసంపై ఎలాగైనా పైచేయి సాధించాలనే ధృడ సంకల్పంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
ఈ నెల 18న బల్దియా కార్యాలయంలో జరగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశానికి తప్పకుండా హాజరై మద్దతు తెలపాలని రాజకీయ పార్టీలు తమ కౌన్సిల్ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్‌కు ఈ విప్ అధికారం బాధ్యతలను అప్పగించారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన కౌన్సిలర్లు బడాల సుజాత, అంబకంటి అశోక్, దర్శనాల లక్ష్మణ్, రేష్మ, విజయ్ నివాస గృహాల వద్దకు ఈ విప్ నోటీసులు అందించేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటిగోడలకు వాటిని అతికించారు. పట్టణంలో మొత్తం 49 వార్డులు ఉండగా బీఆర్ఎస్ నుంచి 24 మంది, బీజేపీ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఎంఐఎం నుంచి ఐదుగురు, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. అయితే కౌన్సిల్ సభ్యులు పార్టీల మార్పుతో సంఖ్యాబలం తారుమారైపోయింది.