AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రగ్స్‌పై ఏపీ, తెలంగాణ ఉమ్మడి పోరు.. రేవంత్, చంద్రబాబు భేటీలో కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశాలను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ముఖ్యమంత్రుల సమావేశ వివరాలను వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. 10 ఏళ్లు పూర్తయినా విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని.. వాటిపై ఈ సమావేశంలో చర్చించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్స్ చేయాలని నిర్ణయించామని.. సైబర్ నేరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇక ఇటీవలె ఏపీలో కూడా యాంటీ నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం గమనార్హం.


రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమగ్రంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారని.. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక మంత్రులతో కూడిన మరో కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామని.. భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించాల్సిన సమస్యలపై అధికారుల కమిటీ చర్చిస్తుందని.. అక్కడ పరిష్కారం కాని సమస్యలను మంత్రుల కమిటీలో చర్చించనున్నట్లు తెలిపారు. అయితే అక్కడ కూడా ఆ సమస్యలకు పరిష్కారం దొరక్కపోతే.. అవి ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్తాయని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడికి రెండు రాష్ట్రాలు కలిసి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

ANN TOP 10