AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మొన్న మావిగన్, నిన్న విజయవాడ… రేపు ఏమంటారో..! జగన్ పై చంద్రబాబు ఫైర్..

“అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకొని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నాటకమాడి, అధికారం పోయాక నిన్న విజయవాడ, నేడు ‘మావిగన్’ అంటూ మాట్లాడుతున్నారు. ఇది మతిస్థిమితం లేని రాజకీయానికి నిదర్శనం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు… వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడిన రాజధాని వంటి సున్నితమైన అంశంపై బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మొన్న మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అంటున్నారు… రేపు ఏమంటారో అంటూ చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి మతిస్థిమితం లేని మాటలు, రాజకీయాలను తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానని అన్నారు.

 

తాము విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తామని, ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు రాజధానిపై గందరగోళం సృష్టిస్తుంటే, తాము మాత్రం రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించి చేసి చూపిస్తున్నామని అన్నారు.

 

కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో, రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

 

సరిగ్గా 24 నెలల్లో పూర్తి చేస్తాం

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 2019, 2023 సంవత్సరాల్లో రెండుసార్లు ఇదే స్టీల్ ప్లాంట్‌కు మోసపూరిత శంకుస్థాపనలు చేశారని, కనీసం తట్ట మట్టి కూడా తీయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అడ్డంకులను తొలగించి, పనులను ప్రారంభించామని తెలిపారు. “ఈరోజు జూలై 3వ తేదీ. ఈ డేట్ రాసి పెట్టుకోండి. సరిగ్గా 24 నెలల్లో, అంటే 2026 జూలై 3వ తేదీ నాటికి ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత” అని చంద్రబాబు సభాముఖంగా హామీ ఇచ్చారు.

 

రూ.36,700 కోట్ల పెట్టుబడి.. గ్రీన్ స్టీల్ ప్రత్యేకత

 

ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ, మొత్తం రూ.36,700 కోట్ల పెట్టుబడితో ఈ కర్మాగారం రూపుదిద్దుకోనుందని తెలిపారు. మొదటి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు ఉక్కు కర్మాగారంపై వెచ్చించనుండగా, ప్లాంట్‌కు అవసరమైన సౌర విద్యుత్ కోసం మరో రూ.20,350 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారని వివరించారు.

 

ఈ ప్లాంట్ ద్వారా రెండు దశల్లో 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో ‘గ్రీన్ స్టీల్’ ఉత్పత్తి చేసే కర్మాగారం మన రాయలసీమలో రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 1100 ఎకరాల భూమిని కేటాయించిందని, గండికోట జలాశయం నుంచి 2 టీఎంసీల నీటిని, జాతీయ రహదారి, రైల్వే లైన్ కనెక్టివిటీని కల్పిస్తున్నామని తెలిపారు.

 

రాయలసీమ రాత మార్చే బాధ్యత నాది

 

“రాయలసీమను రాళ్ల సీమగా కానివ్వను, రత్నాల సీమగా మార్చి చూపిస్తా” అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్‌తో ఈ ప్రాంతం ఉక్కుకు కేంద్రంగా మారుతుందని, విశాఖతో పాటు రాయలసీమ కూడా ఉక్కు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కేవలం స్టీల్ ప్లాంటే కాకుండా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, గోల్డ్ మైనింగ్ వంటి అనేక పరిశ్రమలతో ఈ ప్రాంత ముఖచిత్రాన్నే మార్చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచానికే ఆదర్శంగా రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ఆగస్టు 15లోగా మదనపల్లిలో ప్రారంభిస్తామని ప్రకటించారు.

 

‘వన్ ఫ్యామిలీ, వన్ ఆంత్రప్రెన్యూర్’ లక్ష్యంతో యువతకు, రైతులకు అవసరమైన శిక్షణ, రుణాలు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్ కంటే పెద్ద యూనిట్‌గా రాయలసీమ ప్లాంట్‌ను తీర్చిదిద్దాలని సజ్జన్ జిందాల్‌ను కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు.

 

ఆడవాళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదు!

 

రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లతో రౌడీయిజం పెరిగిపోయిందని, పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

 

వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ, హింసతో, నేరాలతో చేసే రాజకీయాలు ప్రజలకు మంచి చేయవని, అలాంటి వాటికి చరమగీతం పాడతామని అన్నారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుతో రాయలసీమ పారిశ్రామికీకరణ ఇక ఆగదని, ఈ ప్రాంతాన్ని దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు.

ANN TOP 10