AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దమ్ముంటే చర్చకు రండి..! బావ బామ్మర్దులకు మంత్రి జూపల్లి ఓపెన్ ఛాలెంజ్..!

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు మరోసారి హీట్ పెంచాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నేతలు చెప్పిన లెక్కలనే తాను మాట్లాడానని, ఇందులో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

 

పాలమూరు పౌరుషమా.. కల్వకుంట్ల పౌరుషమా?

 

మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇది పాలమూరు పౌరుషమా? కల్వకుంట్ల పౌరుషమా? లేక తన్నీరు పౌరుషమా? తేల్చుకుందాం రండి’ అంటూ కేటీఆర్, హరీశ్‌రావులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల వివరాలపై బహిరంగ చర్చకు తానే స్వయంగా సిద్ధమని ఆయన ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

 

తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

 

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై మోపిన అప్పుల భారం గురించి తాను ప్రస్తావించిన అంశాలన్నీ వందకు వంద శాతం నిజాలని జూపల్లి పేర్కొన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పు అని కేటీఆర్ కానీ, హరీశ్‌రావు కానీ నిరూపిస్తే.. తాను తక్షణమే తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే వారు ఏం చేస్తారని ప్రశ్నించారు.

 

అసెంబ్లీ రికార్డుల ఆధారంగానే..

 

తానేదో గాల్లో లెక్కలు చెప్పడం లేదని, గతంలో కేటీఆర్, హరీశ్‌రావు స్వయంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికలు, చెప్పిన లెక్కల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని జూపల్లి స్పష్టం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన నిలదీశారు. నిజాలు మాట్లాడితే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ సవాల్‌తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి మంత్రి జూపల్లి విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్‌పై కేటీఆర్, హరీశ్‌రావు ఎలా స్పందిస్తారో, ఈ అప్పుల పంచాయితీ ఎటు దారితీస్తుందో చూడాలి.

ANN TOP 10