AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ మామిడి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..

ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ధరల పతనానికి కారణాలు గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

 

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్వయంగా తెలుసుకున్నారు. తోతాపురి మామిడి ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

 

దీంతో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సాగు నుంచి ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, దేశీయ విక్రయాలు, ఎగుమతుల వరకు మొత్తం వ్యవస్థను కమిటీ సమీక్షించనుంది.

 

రాబోయే పది రోజుల్లో తోతాపురి మామిడి సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కమిటీ సందర్శించనుంది. రైతులు, ప్రాసెసింగ్‌ పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఉద్యాన శాఖ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది.

 

సాగు వ్యయం, రైతుల ఆదాయం, ప్రాసెసింగ్‌ సామర్థ్యం, డిమాండ్‌-సరఫరా పరిస్థితులు, దేశీయ, విదేశీ మార్కెట్లలో ధరలు పడిపోవడానికి గల కారణాలను కమిటీ పరిశీలించనుంది. అనంతరం రైతులకు మెరుగైన ధరలు లభించేలా, ఈ రంగాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం అయ్యేలా కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేయనుంది

ANN TOP 10