AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతి ఓ భారీ అవినీతి యజ్ఞం..! విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. టీడీపీ ‘అమరావతి’ అంటుంటే, వైసీపీ ‘మావిగన్’ అనడం వంటి అర్థరహిత వాదనలను పక్కనపెట్టి, రాజధాని పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై దృష్టి సారించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో సుమారు రూ.15,000 కోట్ల అవినీతికి పథకం రచించారని, ఈ అవినీతి యజ్ఞంపై పూర్తి ఆధారాలతో త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

 

ఒక బాధ్యతగల పౌరుడిగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నానంటూ విజయసాయి రెడ్డి పలు కీలక ప్రశ్నలను సంధించారు. “రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా ఇంకా రాజధాని ఎక్కడో తేల్చకుండా చర్చించడం అందరూ సిగ్గుపడాల్సిన విషయం కాదా? 2029 ఎన్నికల్లో కూడా రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయించాలా? ఈ రాజకీయ చదరంగానికి అన్ని పార్టీలు బాధ్యత వహించవద్దా?” అని ఆయన నిలదీశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు పక్కనపెట్టారని ఆయన ప్రశ్నించారు.

 

అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని ఆయన వివరంగా ఆరోపించారు. “ప్రస్తుత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి నిర్మాణంలోనూ అంచనాలను భారీగా పెంచి చూపారు. ఇది ‘దేవతల నగరం’ అనే బ్రాండింగ్‌తో సాగుతున్న అతిపెద్ద అవినీతి పథకం. అధికారంలో ఉన్నవారు 25 నుంచి 30 శాతం వరకు కమీషన్లుగా దండుకుంటున్నారు. అంటే ఇది సుమారు రూ.15,000 కోట్ల లంచాల స్కామ్. అసలు అమరేశ్వర ఆలయం, బుద్ధుని విగ్రహం ఉన్న ప్రాంతానికి, ఇప్పుడు భవనాలు కడుతున్న ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ అమరావతి పుణ్యక్షేత్రం అయితే, ఈ అమరావతి అవినీతి ప్రవహించే క్షేత్రం” అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

 

మొదటి దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించకపోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని కోసం లక్ష ఎకరాలతో ఏం చేస్తారని నిలదీశారు. విభజన చట్టంలోనే వీజీటీఎం (విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) అభివృద్ధి ప్రస్తావన ఉన్నప్పుడు, ఆ ప్రాంతమంతా రాజధాని భవనాలను విస్తరిస్తే నష్టమేమిటని ఆయన సూచించారు. వైసీపీ ‘మావిగన్’ అనడం వల్ల ప్రయోజనమేంటని, ఇప్పటికే పూర్తయిన నిర్మాణాల గతేంటని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం అంటే పార్టీలు కమీషన్లు దండుకోవడం కాదని హితవు పలికారు.

 

అమరావతి పేరుతో జరుగుతున్న ఈ అవినీతిపై ఎస్కలేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో, ప్రజాపక్షాన త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

ANN TOP 10