AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘నాగబంధం’ సినిమా మూవీ రివ్యూ..!

ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న హీరోతో 100 కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా తీయాలనుకోవడం అంత ఆషామాషీ విషయమేం కాదు. కానీ ‘నాగబంధం’ సినిమా విషయంలో ఇలాంటి ఒక అద్భుతం జరిగింది. ‘పెదకాపు’ అనే ఒకే ఒక సినిమా చేసిన ‘విరాట్ కర్ణ’తో ‘నాగబంధం’ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి అభిషేక్ నామా దర్శకత్వం వహించాడు. నభా నటేశ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

 

ఆర్కియాలజీ డిపార్టుమెంట్ లో ప్రభాకర్ (జగపతిబాబు) చీఫ్ గా పనిచేస్తుంటాడు. ఆధ్యాత్మిక పరమైన అంశాలపై అపారమైన ఆసక్తి ఉన్న కారణంగా ఆయన ఎక్కువగా ఆ విషయాలపై ఫోకస్ చేస్తుంటాడు. పురాణాలలో పేర్కొనబడిన విరాటమూర్తి ఆలయం ఎక్కడ ఉందనేది తెలుసుకోవడం కోసం ఆయన తన అన్వేషణ కొనసాగిస్తూ ఉంటాడు. ఈ విషయంపై ఆయన సహచరులైన టెస్లా .. అలీ (రిషబ్ సాహ్ని) హిమాలయాలలో అన్వేషించడం మొదలుపెడతారు. అక్కడి గుహలో కాలవృక్షం చేత బంధించబడిన బైరాగి (గరుడ రామ్)ను చూస్తారు.

 

బైరాగి తన మాటల చేత అలీని తన వైపుకు తిప్పుకుంటాడు. అతీతమైన శక్తులు .. అపారమైన సంపదలు దక్కించుకోవాలంటే, విష్ణుమూర్తి ఆలయానికి సంబంధించిన నాగబంధం విడిపించమని చెబుతాడు. నాగబంధనం విడదీయాలంటే, రహస్యంగా ఉంచబడిన ‘బ్రహ్మకమలం’.. ‘గరుడ మంత్రాలు’ను సాధించవలసి ఉందని అంటాడు. తనని కాలవృక్షం నుంచి విడిపించడానికి కూడా అవే అవసరమవుతాయని చెబుతాడు. దాంతో అలీ వాటిని సాధించే పనిలో పడతాడు. అందుకోసం తన అనుచరులను అన్ని దిక్కులకు పంపిస్తాడు.

 

‘తులసివనం’లో ‘రుద్ర’ ( విరాట్ కర్ణ) తన చెల్లెలు మానస (సోనియా సింగ్)తో కలిసి నివసిస్తూ ఉంటాడు. పడవ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. వారి గ్రామదేవత మానసాదేవి. తన చెల్లి రాజు ప్రేమలో పడిందని తెలుసుకున్న రుద్ర, వాళ్ల పెళ్లికి అంగీకరిస్తాడు. పెళ్లి చేయడానికి అవసరమైన డబ్బును ఎలా సమకూర్చాలా అని ఆలోచన చేస్తుంటాడు. అదేసమయంలో అలీ అనుచరులు ‘రుద్ర’ను కలుస్తారు. పడవలో తమని ‘భైరవకోన’ తీసుకెళ్లమని అడుగుతారు.

 

గతంలో బ్రహ్మ కమలం’ కోసం ప్రభాకర్ ప్రయత్నించి విఫలమవుతాడు. అతను వదిలేసిన ‘భైరవకోన’లోనే ఆ ‘బ్రహ్మ కమలం’ ఉందని అలీ అనుచరులు తెలుసుకుంటారు. అందువలన అక్కడికి తమని పడవలో తీసుకుని వెళితే పెద్ద మొత్తంలో ముట్టజెబుతామని అంటారు. డబ్బు కోసమే ఎదురుచూస్తున్న ‘రుద్ర’ వాళ్లను వెంటబెట్టుకుని భైరవకోనకి బయల్దేరతాడు.

 

అలీ మనుషులు అన్వేషిస్తున్న ‘బ్రహ్మ కమలం’ గురించిగానీ, దాని మహిమను గురించి గాని అతనికి తెలియదు. అందువలన దానిని సాధించడంలో వాళ్లకి సాయపడదామని అనుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఆ బ్రహ్మకమలంతో అతనికి గల సంబంధం ఏమిటి? పురావస్తు విభాగానికి చెందిన ప్రభాకర్ కూడా దానికోసం ఎందుకు ట్రై చేస్తున్నాడు? అనేది మిగతా కథ.

 

అతీతమైన శక్తులను .. అపారమైన సంపదలను ప్రసాదించే ‘బ్రహ్మ కమలం’ చుట్టూ తిరిగే కథ ఇది. తన స్వార్థం కోసం ఆ బ్రహ్మ కమలాన్ని దక్కించుకోవడానికి విలన్ ప్రయత్నించడం .. హీరో అడ్డు కోవడమే ఈ కథలోని ప్రధానమైన అంశం. పురావస్తు విభాగంలో పనిచేసే ప్రభాకర్ బ్రహ్మకమలం కోసం ఎందుకు ట్రై చేస్తున్నాడు? ఆ బ్రహ్మ కమలాన్ని కాపాడే శక్తి హీరోకి మాత్రమే ఎందుకు ఉంది? అనేది ఆడియన్స్ ను ఆలోచింపజేసే మరో ఆసక్తికరమైన విషయం.

 

విరాటమూర్తి ఆలయం .. నాగబంధం గురించిన రహస్యాలను తెలుసుకునే పనిలో ప్రభాకర్ నిమగ్నమై ఉంటాడు. కాలవృక్షం నుంచి విముక్తిని పొందాలనే ఆత్రుతలో బైరాగి .. అతని ద్వారా బ్రహ్మకమలాన్ని సొంతం చేసుకోవాలనే దురాశతో అలీ ఉంటారు. బ్రహ్మకమలం గొప్పతనం తెలియని హీరో .. దానిని వెతికే విలన్ గ్యాంగ్ కి దారిచూపిస్తుంటాడు. ఇలా బ్రహ్మకమలాన్ని కేంద్రంగా చేసుకుని, ఈ కథ అన్ని వైపుల నుంచి నడుస్తుంటుంది. దాని చుట్టూనే ప్రధానమైన పాత్రలన్నీ ప్రదక్షిణ చేస్తుంటాయి.

 

ఈ కథ మొదలైనప్పుడు ఇది అనంతపద్మనాభ స్వామి ఆలయానికి సంబధించిన చరిత్రను .. అక్కడి నిధి రహస్యాలు .. విస్మయులను చేసే అక్కడి విశేషాలను కలుపుకుంటూ సాగే కథ అనిపిస్తుంది. ఆ తరువాత బ్రహ్మకమలం ఉన్నది శ్రీరంగపురంలో అంటూ, శ్రీరంగానికి దగ్గరగా ఉన్న పేరు వాడారు. శ్రీ రంగనాథస్వామి పేరు మనకి ఎక్కువగా వినిపిస్తుంది. అయితే పై రెండు క్షేత్రాలకు సంబంధించిన విషయాలలో కమిట్ కాకపోవడం వలన, ఆడియన్స్ లో తొలి అయోమయం ఇక్కడి నుంచే మొదలవుతుంది.

 

హీరోకి మరణం లేని వరం కావాలి .. దానిని ప్రసాదించే బ్రహ్మ కమలం కావాలి. అయితే అతను ఆశపడుతున్న దానిని బ్రహ్మకమలం ఎలా అందిస్తుంది? దానిని ఉపయోగించే విధానం ఎలా ఉంటుంది? అనేది ఆడియన్స్ కి క్లారిటీ రాదు. కాలవృక్షానికి బందీగా ఉన్న బైరాగి కూడా నిధి నిక్షేపాలు చూసి ఉక్కిరిబిక్కిరైపోతాడు తప్ప అంతకుమించిన అతీంద్రియ శక్తులపై దృష్టి పెట్టినట్టుగా కనిపించడు. ఇక హీరోను కొన్ని సందర్భాలలో మెడలో పాము వేసి .. త్రిశూలం పట్టించి చూపించారు. ఇతనే శివుడు అనుకోవాలా? లేదంటే ఇతనికి శివానుగ్రహం ఉందనుకోవాలా? అనేది మరో కన్ఫ్యూజన్. ఇలాంటి కన్ఫ్యూజన్ లు ఈ సినిమాలో చాలానే ఉంటాయి.

 

కథ .. కథనాలు చూస్తే మనకి ‘అంజి’ సినిమా గుర్తుకువస్తుంది. కథను ఎత్తుకున్న తీరు కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. కథాకథనాల సంగతి అటుంచితే, ఆ రెండింటినీ వీఎఫ్ ఎక్స్ డామినేట్ చేసిందనే చెప్పాలి. దర్శకుడు విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి ట్రై చేసినట్టుగా తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల వీఎఫ్ ఎక్స్ బాగానే అనిపించినప్పటికీ, అక్కడక్కడా తేలిపోవడం కూడా మనకి తెలుస్తూనే ఉంటుంది.

 

ఆరంభంలో హిమాలయాలలోని గుహలకు సంబంధించిన షాట్స్ .. మానసాదేవి జాతర నేపథ్యంలో సీన్స్ .. అనంత పద్మనాభస్వామివారి ఆలయ నేపథ్యంలో సన్నివేశాలు .. బ్రహ్మ కమలాన్ని దొంగిలించడం .. దానిని తీసుకుని వెళుతుంటే గరుడపక్షి దాడి చేయడం వంటి దృశ్యాలు కూడా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ రేంజ్ లో డిజైన్ చేశారు. సెకండాఫ్ లో యాక్షన్ సీన్స్ ను అవసరానికి మించి సాగదీశారు.

 

అమరత్వం కోసం ఆరాటపడే విలన్ ఆ విషయాన్ని మరిచిపోయినట్టుగా కనిపిస్తాడు. చెల్లెలి పెళ్లి కోసం బ్రహ్మ కమలం వెంటపడిన ఓ సాధారణ యువకుడు, చివర్లో సనాతన ధర్మం గురించి భారీ డైలాగులు చెబుతాడు. చాలా ఏళ్లుగా బందీగా ఉండి విముక్తుడైన బైరాగి ప్రధానమైన ఉద్దేశం ఏమిటనేది అంతుచిక్కదు. తెరపై కావాల్సినంత భారీతనం కనిస్తుంది. కానీ కథాకథనాలపై సరైన కసరత్తు జరగలేదేమో అనిపించే కంటెంట్ ఇది.

 

నిర్మాణ పరమైన విలువల పరంగా ఈ సినిమాకి వంక బెట్టలేం. సుందర రాజన్ కెమెరా పనితనం .. జునైద్ కుమార్ – అబె సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, పెంచుకుంటూ వెళ్లిన యాక్షన్ సీన్స్ ను కాస్త ట్రిమ్ చేసుకుంటూ రావొచ్చు.

 

అనంతపద్మనాభ స్వామివారి మూర్తి .. బ్రహ్మకమలంగా బ్రహ్మదేవుడి మూర్తితో కూడిన స్వర్ణ పుష్పాన్ని డిజైన్ చేసిన తీరు మాత్రం చాలా బాగుంది. అనంతపద్మనాభ స్వామి వారి ఆలయ నేపథ్యం .. అక్కడ డిజైన్ చేసిన సాంగ్ .. ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. కథాకథనాల పరంగా అంత బలంగా లేని ఈ కంటెంట్, గ్రాఫిక్స్ పరంగా కాస్త ఎక్కవ మార్కులే కొట్టేస్తుందని చెప్పాలి.

ANN TOP 10