AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డీఎస్‌ మరణం నన్ను ఎంతో బాధించింది : ప్రధాని మోదీ

హైదరాబాద్ : రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ (D. Srinivas) మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం నన్ను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఎక్స్‌ వేదిక ద్వారా సానుభూతి తెలిపారు.

శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో డీఎస్‌ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించారు.

1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో జన్మించిన డీఎస్.. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన ఆయన.. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో గెలుపొందారు.

అనంతరం 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్‌ఎస్‌తో పోత్తుకుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా సేవలందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో 2015లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

ANN TOP 10