లోక్‌సభలో ఎంపీల ప్రమాణస్వీకారం ముగిసింది. తెలంగాణ ఎంపీలతో పలువురు సభ్యులు ఈరోజు ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా ఎంపీలు కొంత మంది నినాదాలు చేశారు. సురేష్ షెట్కర్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, అసదుద్దీన్ ఒవైసీ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురాంరెడ్డి.. జై తెలంగాణ అని నినదించారు. జై సమ్మక్క సారలమ్మ అని ఈటల, జై లక్ష్మీనర్సింహస్వామి అని కిరణ్‌కుమార్ రెడ్డి, జై భద్రకాళి అని కడియం కావ్య, జై తుల్జాభవాని అంటూ బలరాం నాయక్ నినదించారు.
కలకలం రేపిన ఒవైసీ
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్‌సభలో కలకలం రేగింది. అసదుద్దీన్ వ్యవహారంపై పలువురు మంత్రులు, బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ హామీయివ్వడంతో వివాదం సద్దుమణిగింది.
జై పాలస్తీనా అంటే తప్పేంటి?
తన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ సమర్థించుకున్నారు. జై పాలస్తీనా అంటే తప్పేంటని ప్రశ్నించారు. ‘‘ప్రమాణస్వీకారం సందర్భంగా అందరూ ఏదో ఒక నినాదం చేశారు. నేను కేవలం జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అన్నాను. ఇది ఎలా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది? అలాంటి నింబంధన ఏదైనా ఉంటే చూపాల”ని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
అసదుద్దీన్ చేసింది తప్పు: కిషన్‌రెడ్డి
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి స్సందించారు. సభా నిబంధనలకు విరుద్ధంగా అసదుద్దీన్ వ్యవహరించారని విమర్శించారు. పార్లమెంట్‌లో ‘జై పాలస్తీనా’ నినాదం చేయడం పూర్తిగా తప్పు. ఇది సభా నిబంధనలకు విరుద్ధం. భారత్‌లో ఉంటూ ‘భారత్ మాతాకీ జై’ అనరు కానీ రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారని.. ప్రజలు అర్థం చేసుకోవాల”ని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.