AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత ఆర్మీ నూతన అధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ..

భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ సి. పాండే ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో, ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదీని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదీ ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. ద్వివేదీ 1964లో జన్మించారు. 1984లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. ఆర్మీలో 40 ఏళ్ల సర్వీస్ ఉన్న ఆయన ఆర్మీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. కశ్మీర్ లోయ, రాజస్థాన్ సెక్టార్‌లో పనిచేశారు.

సెక్టార్ కమాండర్, అస్సాం రైఫిల్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన డైరెక్టర్ జనరల్ ఇన్‌ఫాంట్రీ, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా కూడా వ్యవహరించారు. రేవా సైనిక్ స్కూల్ పాఠశాలలో విద్యనభ్యసించిన ఆయన.. నేషనల్ డిఫెన్స్ కాలేజీ, యూఎస్ ఆర్మీ వార్ కళాశాలలో చదువుకున్నారు. డిఫెన్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్ లో ఎంఫిల్ చేశారు. స్ట్రాటజిక్ స్టడీస్, మిలిటరీ స్టడీస్‌లో రెండు మాస్టర్ డిగ్రీ పట్టాలను పొందారు. దేశానికి ఆయన సేవలకు గాను పరమ విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను కూడా పొందారు. ఇక ప్రస్తుత ఆర్మీ అధిపతి మనోజ్ పాండే 2022 ఏప్రిల్ 30న ఆర్మీ అధిపతిగా విధుల్లో చేరారు. మే నెలాఖరునే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని కేంద్రం మరో నెల రోజుల పాటు పొడిగించింది.

ANN TOP 10