బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని ప్రజాసేవా భవన్‌లో మీడియాతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన రాశి 659 రకం కోరుకోవడంతోనే రద్దీ ఉందన్నారు. కచ్చితంగా రైతులు కోరుకునే రకమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ విషయం కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లినట్లు గుర్తు చేశారు. రైతుల సెంటిమెంటే.. ప్రభుత్వం సెంటిమెంట్ అన్నారు. రైతన్నలు కోరుకునేది రేవంత్ ప్రభుత్వం అదే చేస్తుందన్నారు. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్‌లో కూడా అనేక రకమైన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలీసులు రైతులను సరైన పద్ధతిలో క్రమబద్దీకరిస్తున్నారన్నారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా డ్యూటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు.
ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మత్తడివాగు- సోన్కాస్ లక్షీపూర్- సాత్నాల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్నారు. ప్రతిపక్షాల పార్టీలు విత్తన రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో రైతులపై ఎలాంటి లార్టీ ఛార్జ్ జరగలేదని స్పష్టం చేశారు. ఆగ్రో డీలర్లతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమావేశం ఏర్పాటు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులపై విక్రయిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే పిడియాక్ట్ కేసులు పెట్టి అణిచివేస్తామన్నారు. అదే విధంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. పాయల్ శంకర్ తనయుడు జోగు రామన్న తనయులపై ఇసుక రవాణా ఆరోపణలు వస్తున్నాయన్నారు. జోగురామన్న, పాయల్ శంకర్ కుటుంబం రెండు కలిసి ఆదిలాబాద్‌ను సర్వనాశనం చేసున్నాయన్నారు. ఇద్దరం కలిసి దోచుకుందాం అన్నట్లుగా వారి తీరు ఉందని మండిపడ్డారు. ఇసుక కుంభకోణంలో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించేది లేదన్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారి ఆగడాలను అరికడతామన్నారు. పోలీసు శాఖ, మైనింగ్ శాఖ వారిపై చర్యలు తీసుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు.









