ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. జనాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో చాలా విషపూరితమైన విద్వేష ప్రసంగాలను మోడీ చేశారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలపై మన్మోహన్ సింగ్ తొలిసారి స్పందించిన ఆయన.. పదేళ్ల బీజేపీ పాలనను వివరిస్తూ పంజాబ్ ప్రజలకు ఆయన లేఖ రాశారు. దేశంలో నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఓటర్లను కోరారు. అందుకు ఇదే చివరి అవకాశమన్నారు. మోడీ ప్రసంగాలు పూర్తిగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే స్వభావం కలిగి ఉన్నాయని మండిపడ్డారు.
గడిచిన పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తిన్నదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి గౌరవాన్ని, ప్రధాని పదవికి ఉన్న స్థాయిని ప్రధాని మోడీ దిగజార్చారని, అలా ప్రధాని స్థాయిని దిగజార్చిన తొలి ప్రధాని మోడీ యేనని వ్యాఖ్యానించారు. ఏ ప్రధాని కూడా సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇలాంటి ద్వేషపూరిత, అన్ పార్లమెంటరీ, ముతక పదాలను ఉచ్చరించలేదన్నారు. తనపై కూడా కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారని, జీవితంలో ఎప్పుడూ ఒక సామాజికవర్గాన్ని మరో సామాజిక వర్గం నుంచి వేరు చేయలేదని కౌంటర్ ఇచ్చారు. అది బీజేపీకి మాత్రమే ఉన్న ఏకైక కాపీరైట్ అంటూ కామెంట్స్ చేశారు. పంజాబ్‌కు చెందిన 750 మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయారని గుర్తు చేశారు. లాఠీలు, రబ్బర్ బుల్లెట్‌లు సరిపోవన్నట్లుగా రైతులపై మాటలతో కూడా దాడి చేశారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారని, కానీ పంజాబీలను బీజేపీ సర్కార్ పట్టించుకోలేదని మన్మోహన్ సింగ్ లేఖలో ప్రస్తవించారు.









