తెలంగాణలో గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. జూన్ 9న ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. అభ్యర్థులను ఉదయం 9గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. పది గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్షకు టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1న మధ్యాహ్నం 2గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు అనుసరించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసింది.
కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, మ్యాథమెటిక్స్ టేబుళ్లు, లాగ్‌బుక్‌లు, లాగ్ టేబుళ్లు, వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్, నోట్స్, ఛార్ట్స్, జ్యువెలరీ, ఇతర గ్యాడ్జెట్లు/ ఎలక్ట్రానిక్ పరికరాలు, రికార్డింగ్ పరికరాలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకోవద్దు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిలేదు. బయటకు వెళ్లే ముందు ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. పరీక్ష కేంద్రం వద్ద బయో మెట్రిక్ ఉదయం 9.30గంటలకే మొదలవుతుంది. ఇన్విజిలేటర్ బయో మెట్రిక్ క్యాప్చర్ చేయకుండా అభ్యర్థుల పరీక్ష కేంద్రాన్ని వీడి వెళ్లొద్దు. ఒకవేళ ఎవరైనా తమ బయోమెట్రిక్‌లను ఇవ్వకపోతే.. వారి ఓఎంఆర్ జవాబు పత్రం మూల్యాంకనం చేయరు. బయో మెట్రిక్ రికార్డింగ్‌కు ఆటంకం కలిగించే విధంగా మెహెందీ, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు.









