AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

తెలంగాణలో పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో 4 లక్షల 63 వేల 839 ఓట్లర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. అందులో 2,88,189 మంది పురుషులు కాగా 1,75,645 మంది మహిళా ఓటర్లు, 05 ఇతర ఓటర్లు ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈసారి పట్టభద్రుల స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. అభ్యర్థుల సంఖ్య హాఫ్‌ సెంచరీ దాటినప్పటికీ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి జంబో బ్యాలెట్ పెపర్ తో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి విక్టరీ కొట్టేందుకు కాంగ్రెస్‌ గట్టిగానే శ్రమించింది. ప్రతిరోజు సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరపున రాకేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరపున నవీన్‌ పోటీపడుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 5న వెలువడనున్నాయి.

ANN TOP 10