AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’కు సంగీతం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని కోరడం… మన తెలంగాణ గీతానికి పొరుగు రాష్ట్రం వారు సంగీతం అందించడమేంటని తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ సంఘం (టీసీఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆ మేరకు టీసీఎంఏ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.

అయితే, ఈ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో… మరోసారి మార్పులు, చేర్పులపై కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేశారు.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో, ఈ గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు.

ఈ పాటను ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ 2003లోనే రాసిన సంగతి తెలిసిందే. ముందు నాలుగు చరణాలతో పాట రాసిన అందెశ్రీ… 2009 నాటికి పూర్తి పాటను రూపొందించారు. అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ గీతం విశేష ప్రజాదరణ పొందింది.

ANN TOP 10