కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరాలశాఖలో భారీ స్కామ్ జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే దోపిడీకి తెరలేపారని ఆరోపణలు చేశారు. కుంభకోణంలో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. సన్నబియ్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందని, ఇందులో మొత్తం రూ. 1100 కోట్ల స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. ధాన్యం అమ్మకాల కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో అవకతకలు జరిగాయని వ్యాఖ్యానించారు. సన్న బియం కోసం జనవరి 25న కమిటీ వేసి.. టెండర్లు పిలిచి మొత్తం ఒకేరోజులో పూర్తి చేశారని దుయ్యబట్టారు. మొత్తం ఒకే రోజులో పూర్తి చేయాడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. గ్లోబల్ టెండర్లను పిలిచి మొత్తం నాలుగు సంస్థలకు కట్టబెట్టారని అన్నారు. కేంద్రీయ భండర్ సంస్థలను గత ప్రభుత్వం బ్లాక్ చేసిందన్నారు. ఇప్పుడు నిబంధనలు మార్చేసి మళ్లీ కేంద్రీయ భండర్ సంస్థలకే టెండర్ కట్టబెట్టిందని చెప్పారు. క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ. 223 రూపాయలు అదనంగా చెల్లించాలని, రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లను బెదిరిస్తున్నాయన్నారు.
రేవంత్, ఉత్తమ్ ఎందుకు వివరణ ఇవ్వలేదు?
అదనంగా క్వింటాల్‌కు రూ.200 చొప్పున తీసుకున్నా.. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులకు రూ.700 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరపున డబ్బుల వసూళ్లు ఎలా చేస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేసిన రవీందర్ సింగ్ 15 రోజుల క్రితం ఈ ఆరోపణలను తొలిసారిగా చేశారని కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి, సీఎం రేవంత్ నుంచి ఎలాంటి వివరణ రాలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నందున తెలంగాణ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ పాలన సాక్షిగా వెయ్యేళ్లైనా చెక్కు చెదరని పునాదిని బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందని కేటీఆర్ అన్నారు.









