AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్, బీజేపీ అవాస్తవాలతో బద్నం చేస్తున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

సివిల్ సప్లయ్ శాఖను బీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ ఆగంపట్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ పౌరసరఫరాల శాఖపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆదివారం గాంధీ భవన్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌లు మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సివిల్ సప్లయ్‌పై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని, పైసా అవినీతి జరగలేదన్నారు. పూర్తిగా మమ్మల్ని అబద్దాలతో బద్నాం చేస్తున్నారని, బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి సివిల్ సప్లై శాఖపై రూ. 11 వేల అప్పుల్లో ముంచారన్నారు. సివిల్ సప్లయ్ కర్పొరేషన్‌పై కూడా 55 వేల కోట్లు అప్పు చేశారన్నారు. రూ. 20 వేల కోట్ల ధాన్యాన్ని గాలికి వదిలేసి పోయారన్నారు. ఒక్క గింజ సన్నబియ్యం కొనకుండా స్కామ్ ఎలా చేశామని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే తాము ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేస్తున్నామని స్పష్టం చేశారు. ధాన్యం కొన్న మూడు రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొంటున్నామన్నారు. తనపై యూ ట్యాక్స్ అంటూ ఆరోపణలు చేసిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దుర్మార్గపు నీచమైన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని సూచించారు. కొత్తగా బీజేపీలో చేరి ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కోవచ్చని, తమకు అలాంటి అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఆలోచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం క్వింటాల్ ధర రూ. 1700 వచ్చిందని, తమ ప్రభుత్వంలో క్వింటాల్ ధర రూ. 2007 వచ్చిందన్నారు. రూ. 200 కోట్ల వరకు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు జరిగిందని, రూ. 2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

జనరేటర్‌తో సభలు పెట్టి.. కరెంట్ పోయిందంటే ఎలా: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కాకుండానే ఎన్నికల కోడ్ వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే హామీలు అమలు చేస్తున్నామన్నారు. పరిపాలనను గాడిలో పెట్టే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరుతున్నామని అన్నారు. మేడిగడ్డపై కూడా విపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరామన్నారు. మీరు చేసిన పొరపాట్లు తాము చేయకుండా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. జనరేటర్‌తో సభలు పెట్టుకోని కరెంట్ పోయిందని కేసీఆర్ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట సభలో జనరేటర్ల ద్వారా విద్యుత్ తీసుకున్నారని గుర్తు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా కరెంట్ పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో అదే ఆస్పత్రిలో పేషెంట్ల ఎలుకలు పేషెంట్ల కాళ్లు కొరికాయని, 121 సార్లు కరెంటు పోయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగిన విద్యుత్ సప్లయ్ చేశామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

ANN TOP 10