ఇదిగో అదిగో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ పాస్ చేస్తోందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. నల్గొండ జిల్లాలో బుధవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఉద్యమకారులకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామన్నారని, దీనిపై ఎక్కడైనా సమీక్ష జరిగిందా అని నిలదీశారు. నిరుద్యోగుల భర్తీపై ఎక్కడైనా చర్చించారా అని అడిగారు.
ఇప్పటి వరకు తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ఎవరికీ తెలియదని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా తమకు ఉద్యోగాలు రావడం లేదని చెబుతున్నారని, గాల్లో మాటలు చెప్పి.. కాగితాల మీద రాతలు చూపించి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమి లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా.. నిరుద్యోగ భృతిపై ఏమైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. అవగాహన రాహిత్యం, అనుభవ లేమితనం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో ప్రజల కోసం పని చేసే నాయకుడిని ఎన్నుకోవాలని డీకే అరుణ కోరారు.









