రుణమాఫీ చేస్తామని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఇప్పుడోమో ఆగస్టు 15 తేదీ చెప్పుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సన్న వడ్లకు బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను వెన్నుపోటు పొడిచిందని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని దుయ్యబట్టారు. దేవుళ్ల ఒట్ల పేరుతో ప్రజలకు పంగనామం పెట్టిందన్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లు పండిస్తారని చెప్పారు. చాలా తక్కువ మంది సన్న రకం వడ్ల పండిస్తారని అన్నారు. క్వింటల్ వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. దొడ్డు రకం వడ్లను కొనగోలు చేయాడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉందని చెప్పారు.
రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్న పట్టించుకోవడం లేదని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి వారాలు గడుస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని తెలిపారు. నిన్న 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. ధాన్యం, బోనస్, సన్నవడ్లు, దొడ్లు వడ్లు అంటు రాజకీయాలు చేస్తోందన్నారు. ఇలానే కొనసాగులే మరో రెండు ధాన్యం కొనుగోలు చేయడానికి సమయం పడుతుందన్నారు. వర్షాలు పడి ధాన్యం మొలకెత్తుతుంటే దానికి బాధ్యులు ఎవరని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.









