AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘నేను లోకల్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాన్‌లోకల్‌’

మా కెప్టెన్‌ మోడీ అని.. కాంగ్రెస్ కెప్టెన్ ఎవరని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఇక బీఆర్‌ఎస్ కెప్టెన్ లేరు.. ప్లేయర్లు కూడా లేరని ఎద్దేవా చేశారు. గురువారం కరీంనగర్‌ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ కుమార్ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. బండి సంజయ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్‌ తర్వాత కరీంనగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా.. ర్యాలీలో నేతలు పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ, రాజీవ్‌చౌక్ మీదుగా టవర్ సర్కిల్ వరకు నేతలు ర్యాలీ నిర్వహించారు. టవర్ సర్కిల్ వద్ద భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు. తనను ఓడించేందుకు రెండు పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. తానూ లోకల్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాన్‌లోకల్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 12వేల కోట్ల రూపాయలతో కరీంనగర్‌ పార్లమెంట్ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు చేసిన తనకే ప్రజల మద్దతు ఉందని బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ సంక్షేమం మోడీ చూసుకుంటారు : గుజరాత్ ముఖ్యమంత్రి

దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్‌ కోసం అన్ని వర్గాల ప్రజలు మే 13న ఓటు వేయాలని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్‌లో బీజేపీ ఖాతా తెరిచిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ భాయి పటేల్ తెలిపారు. సూరత్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుందన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. ఇంకా 399 సీట్లలో మనం గెలిపించాలని పిలుపునిచ్చారు. మోడీజీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారని స్పష్టం చేశారు. మోడీని ఆశీర్వదించండని, తెలంగాణ సంక్షేమాన్ని మోడీ చూసుకుంటారన్నారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారని భూపేంద్ర బాయి పటేల్ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10