సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
(అమ్మన్యూస్, మెదక్):
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకి రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా? అని హరీశ్‌రావు మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన ర్యాలీలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి చాలెంజ్ వేస్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో వస్తున్నా.. నువ్వు వస్తవా..? అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానన్నది నిజమైతే.. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన గ్యారంటీలు అమలు చేసే మాట నిజమైతే.. గన్ పార్క్ వద్దకు రా.. రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడుదాం. ఆగస్టు 15 లోగా రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను తీసుకెళ్లి స్పీకర్‌కు ఇస్తారు. ఒక వేళ అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ గవర్నర్‌కు ఇస్తారు. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతున్నానని అని హరీశ్‌రావు పేర్కొన్నారు.