AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ..!

భర్త మరణించినా అతడ్ని ఆమె మరిచిపోలేదు. ఆయన జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలనుకుంది. అందుకోసం ఏకంగా భర్తకు గుడి కట్టేసింది. అంతటితో ఆగకుండా పతియే ప్రత్యక్ష దైవమంటూ నిత్యం పూజలు చేస్తానంటోంది. మహబూబాబాద్‌ జిల్లా పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన బానోతు హరిబాబు, కల్యాణి దంపతలు. వీరికి 23 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా.. పిల్లలు లేరు. అయినా.. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. కల్యాణిని హరిబాబు కళ్లల్లో పెట్టుకొని చూసుకునేవారు. అయితే నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణించిన కొవిడ్ వీరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2020 సెప్టెంబరు 9న కొవిడ్‌తో హరిబాబు మృతి చెందారు.

భర్త మరణాన్ని కల్యాణి జీర్ణించుకోలేకపోయింది. భర్త హరిబాబును గుర్తు చేసుకుంటూ కాలం గడిపేస్తూ వచ్చింది. తన భర్తకు గుర్తుగా ఏదైనా చేయాలనుకుంది. తమ 23 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా భర్త విగ్రహాంతో పాలరాతితో గుడిని నిర్మించాలనుకుంది. ఆరునెలల క్రితం సోమ్లతండాలోని తమకున్న భూమిలో భర్తకు గుడి నిర్మించింది. రూ.7 లక్షల వెచ్చించి రాజస్థాన్‌లో హరిబాబు పాలరాతి విగ్రహాం తయారు చేయించారు. మొత్తం గుడి కోసం రూ.30 లక్షలు ఖర్చు చేసింది.

బుధవారం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణి, ఆమె కుటుంబసభ్యులు హరిబాబు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడిలో భర్తను నిత్యం పూజించడంతో పాటు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తానని కల్యాణి తెలిపారు. చనిపోయిన భర్తకు గుడి కట్టించిన కల్యాణిని స్థానికులు అభినందిస్తున్నారు. భర్తపై ఆమెకు ఎంత ప్రేమో అని ప్రశంసిస్తున్నారు. పతియే ప్రత్యక్ష దైవం అనే వాఖ్యానికి కల్యాణి అర్థం చెప్పిందని అంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10