AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డబుల్ ఇంజన్ అంటే.. అదానీ, అంబానీ: సీఎం రేవంత్

బీజేపీ ప్రభుత్వం వస్తే రైతులను ఆదుకుంటామని చెప్పి మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో బీజేపీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రజా చార్జషీట్ విడుదల చేసింది. పదేండ్ల మోసం, వందేళ్ల విధ్వంసం పేరుతో ఛార్జ్ షీట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 20 కోట్ల ఉద్యోగాలు యువతకు ఇస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం కనీసం 7 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు మోసం చేశాడని మండిపడ్డారు. ఢిల్లీ సరిహద్దులో లక్షల మంది 16 నెలలు దర్నాలు చేశారని గుర్తు చేశారు. పదేళ్లలో మోడీ వైఫల్యంపై ప్రజలకు వివరించాలని బాధ్యత తమపై ఉందని చెప్పారు. సిస్ బ్యాంక్‌ల్లో లక్షల కోట్ల నల్లధనం తెస్తామని మాట తప్పారని మండిపడ్డారు. రూ. 15 లక్షలు ప్రతి పేద వాడి ఖాతాలో వేస్తామని దేశాన్ని మోసం చేశారని అన్నారు. రూ. 400 ఉన్న సిలిండర్‌ను రూ. 1200లకు పెంచారన్నారు. రూ. 60 ఉన్న పెట్రోల్.. ఇప్పుడు రూ. 110 లకు పెరిగిందన్నారు. సామాన్యులు బ్రతకలేని విధంగా నిత్యావసర ధరలు పెంచారని చెప్పారు.

*అగర్బత్తీలుపై కూడా జీఎస్టీ వేయకుండా వదల్లేదు*

జీఎస్టీ పేరుతో కేంద్రం దోపిడీకి పాల్పడిందన్నారు. భక్తులం అని చెప్పుకునే బీజేపీ చివరికి అగర్బత్తిలను కూడా వదల్లేదని విమర్శించారు. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల, అగర్బత్తిలపై కూడా జీఎస్టీని వేసిందన్నారు. పెన్సిల్, రబ్బర్‌పై కూడా జీస్టీ పన్ను విధించారన్నారు. 1947 నుంచి 2014 వరకు 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పులు రూ. 55 కోట్లని, 2014 నుంచి 2024 వరకు మోడీ ఒక్కరే చేసిన అప్పు రూ. 113 లక్షల కోట్లు చేసిందన్నారు. 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే మోడీ చేసిన అప్పులే ఎక్కవయ్యాయి. అప్పుల నయా భారతాన్ని మోడీ తాకట్టు పెట్టారని విమర్శించారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, అంబానీ అంటూ దుయ్యబట్టారు. ఆర్‌ఎస్ఎస్‌కు అనుగుణంగా బీజేపీ నడుస్తోందన్నారు. దేశంలో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

*మళ్లీ మోడీ వస్తే దేశం సర్వనాశనమే: దీపా దాస్ మున్షీ*

పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందన్నారు. దేశ సంపదను ధనవంతులకు బీజేపీ దోచిపెడుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు. దేశాన్ని, సంపదను, ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించి అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ పాలనలో ధరలు, నిరుద్యోగం పెరిగిందని కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ అన్నారు. మళ్లీ మోడీ ప్రభుత్వం వస్తే దేశం సర్వనాశనం అవుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ధీమాను వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నీ మోడీ సర్కార్ విస్మరించిందని దీపాదాస్ మున్షీ మండిపడ్డారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10