సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సంకల్ప పత్ర’ పేరుతో ఆదివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కలిసి మేనిఫెస్టోను ప్రకటించారు.14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల ప్రకటించింది. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్ పత్ర రూపొందించామని చెప్పారు. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ్ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించామని బీజేపీ నేతలు తెలిపారు.
చాలా శుభదినం: ప్రధాని మోడీ
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇవాళ చాలా శుభదినం అని అన్నారు. నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశామని, యువశక్తి, నారీశక్తి, గరీబ్, కిసాన్‌ను దృష్టిలో ఉంచుకునే సంకల్ప్ పత్ర తయారు చేశామని తెలిపారు. దేశ యువత ఆకాంక్షలను మా సంకల్ప్ పత్ర ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. అదే విధంగా నవరాత్రుల్లో భాగంగా కాత్యాయనీ దేవి పూజ చేసుకుంటామని గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి కూడా అని, సంకల్ప్ పత్ర తయారు చేసిన రాజ్‌నాథ్ బృందానికి అభినందనలు తెలిపారు. సంకల్ప్ పత్ర తయారీకి సూచనలు ఇచ్చిన లక్షల మందికి ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. భవిష్యతులో దేశవ్యాప్తంగా ఒకసారి ఎన్నికలు జరగవచ్చని, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తామని చెప్పారు. చిరువ్యాపారులకు మరిన్ని రుణాలు కల్పిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
14 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో
1. విశ్వ బంధు
2. సురక్షిత భారత్
3. సమృద్ధ భారత్
4. గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్
5. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
6. ఈజ్ ఆఫ్ లివింగ్
7. సాంస్కృతిక వికాసం
8. గుడ్ గవర్నెన్స్
9. స్వస్థ భారత్
10. అత్యుత్తమ శిక్షణ
11. క్రీడావికాసం
12. సంతులిత అభివృద్ధి
13. సాంకేతిక వికాసం
14. సుస్థిర భారత్
మేనిఫెస్టోలోని కీలక హామీలు
70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం
వచ్చే ఐదేళ్లు ఉచిత రేషన్
పీఎం ఆవాస్ యోజన కొనసాగింపు
మురికివాడల్లో నివాసించే పేదలకు ఇళ్లు
పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందజేత
వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి
దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక
ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు
ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం









