మామ, అల్లుడిని తరిమే వరకు నిద్రపోను
(అమ్మన్యూస్, మెదక్):
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మామ, అల్లుళ్లలో ఒకరిని తోటపల్లి, ఇంకొరిని చింతమడకకు పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకుంటా నర్సారెడ్డి , మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ… ‘‘నా టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే’’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యేలు లేకపోవడం బాధాకరమన్నారు. నాయకులు మాజీలు అవుతారు కానీ కార్యకర్తలు మాజీలు కారన్నారు. నీలం మధు వార్డు మెంబర్ నుంచి పైస్థాయికి వచ్చిన వ్యక్తి కనుక కార్యకర్తల బాధ తెలుసన్నారు. బీఆర్‌ఎస్ నాయకులకు డబ్బులు తప్ప కార్యకర్తల బాధలు తెలియవని మండిపడ్డారు. నీలం మధుకు తల్లి, తండ్రి లేరు కాబట్టి మనమే తల్లిదండ్రులమన్నారు. మాటల్లో కాకుండా చేతుల్లో చేద్దామని మైనంపల్లి హనుమంతరావు వెల్లడిరచారు.









