కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ పేరుతో మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఇతర పార్టీల్లాగా తాము మేనిఫెస్టోను విడుదల చేసి వదిలి వేయ్యామని చెప్పారు. 2019లో తాము సంకల్ప్ పత్ర్ పేరుతో ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు. అందులో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేచ్చామని చెప్పారు.
అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు పేల్చారు. శాసనసభ ఎన్నికల్లో డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన అనేక హామీలను ముందుగా కాంగ్రెస్ అమలు చేయాలన్నారు. యూత్ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు ముందుగా అమలు చేయాలన్నారు. దళితుడని బాబూ జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను జగ్జీవన్ రామ్ వ్యతిరేకించారన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.









