మాజీ మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులు ఓ ట్రాష్ అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై యెన్నం శ్రీనివాస్ స్పందిస్తూ గాంధీ భవన్‌లో మీడియాతో సమావేశంలో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, సిరిసిల్లలో కూడా డబ్బులు పంపించినట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించారన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని అంటుంటే పరువు తీశామని కేటీఆర్ అంటేన్నారని విమర్శించారు. బాధితుడిగా తాను ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. ఆధారాలు ఉన్నందుకే పోలీసులు విచారిస్తున్నారని అన్నారు. కేటీఆర్ స్థానంలో తాను ఉంటే ఫోన్ ట్యాపింగ్‌పై నా పాత్ర లేదని అధికారులకు లేఖ రాస్తానని తెలిపారు. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేశారు కాబట్టి తాము నోటీసులు పంపాలని పేర్కొన్నారు. డబ్బులు పంచినట్లు పోలీసులే విచారణలో ఒప్పుకున్నారని గుర్తు చేశారు. మీది మెసేజ్ మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు.









