ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి వస్తున్న అంశాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అసలు దోషులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలీ టాం అండ్ జెర్రీ ఫైట్‌లా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు చివరిలో కలిసిపోతాయని, ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దోషులను కాపాడే ప్రయత్నం రేవంత్ సర్కారు చేస్తుందని, మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. దేశభద్రత, వ్యక్తి గత భద్రతకు భంగం కలిగించేలా పోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని అన్నారు. రియల్ ఎస్టేట్, నగల వ్యాపారులను దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీకి పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించారన్నారు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
* జై శ్రీరాం అంటే కేటీఆర్‌కు కడుపు మంట ఎందుకు?*
ఆ రోజు అధికారంలో ఉన్న పెద్దల ఆదేశం మేరకే ట్యాప్ చేశామని చెబుతున్న ఎందుకు రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. దీనిపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించాలని కోరుతామని స్పష్టం చేశారు. జుగుప్సాకరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయని, ఒక్క రూపాయి అయిన పెట్రోల్ డీజిల్ ధరలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించిందా అని ప్రశ్నించారు. ఈ చర్చకు తాము సిద్ధమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ట్విట్టర్ టిల్లు మొసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. కవితను అరెస్ట్ చేయక పోతే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని ప్రచారం చేశారన్నారు. ఈ రోజు విచారణ సంస్థలు కవితను అరెస్ట్ చేశాయన్నారు. ఎన్ని విన్యాసాలు చేసిన బీజేపీ తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పగలరా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని? సవాల్ చేస్తున్న అన్నారు. జై శ్రీరామ్ అంటే కేటీఆర్‌కు కడుపు మంట ఎందుకని నిలదీశారు. ఎవరి మనోభావాలు వారివి అంటూ మండిపడ్డారు. మోడీ అభివృద్ది ఎజెండా తీసుకునే ఈ ఎన్నికల్లోకి వెళ్తున్నామని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.









