ఏ ముఖం పెట్టుకుని పొలంబాట పడుతున్నావ్..
కాంగ్రెస్ ట్వీట్ వైరల్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాటలో భాగంగా ఆదివారం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ఎండిన పంటలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఏ ముఖం పెట్టుకుని పొలం బాట పడుతున్నావ్ కేసీఆర్? అంటూ ట్విట్టర్ వేదికగా వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో.. ఏ ముఖం పెట్టుకొని పొలం బాట పడుతున్నావ్ కేసీఆర్? నీ పాలనలో రైతులకు ఇచ్చిన మాట తప్పినందుకా? నువ్వు ఇస్తానన్న పంట నష్టం 10 వేలు ఇచ్చేందుకా? అని ప్రశ్నించారు.
అలాగే వడ్లు కొనకుండా రైతుల ఉసురు తీసినందుకా?, మద్దతు ధర కల్పించకుండా రైతులను అప్పుల పాలు చేసినందుకా?, వరి వేస్తే ఉరే అని భయపెట్టేందుకా? లేక కాళేశ్వరంలో స్కాంలో నువ్వు తిన్న పైసలు రైతులకు పంచేందుకా? అని విమర్శల వర్షం కురిపించారు. అంతేగాక గత పదేళ్లలో ఏనాడు రైతుల కష్టాలు పట్టించుకోని నీకు ఇవ్వాళ రైతులు గుర్తొచ్చారా, అయినా నువ్వు కాలు పెట్టిన కాడల్లా నాశనమే, పచ్చని పొలాలు కూడా ఎండిపోతాయి రావొద్దు కేసీఆర్, నీ దరిద్రం పోయిందని సంతోషంగా ఉన్న తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దు కేసీఆర్’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. వీడియో పోస్టు చేశారు. ఇది రాష్ట్రమంతా వైరల్ అవుతోంది.









