తెలంగాణ ఉద్యమకారులకు మీరిచ్చే గౌరవం ఇదేనా?
బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు
పక్క జిల్లాల వారికి బీఆర్‌ఎస్ టికెట్ అమ్ముకున్నదని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని శివానుభవ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పక్క జిల్లాల నుంచి అరువు తెచ్చుకొని పోటీ చేయిస్తున్నారని, స్థానిక నేతలు దొరకలేదా అని విమర్శించారు. కేసీఆర్ కోసం త్యాగం చేసిన వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి వంటి నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, పక్క జిల్లా వాళ్లకు టికెట్లను ఎలా అమ్ముకున్నావో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్ల బీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీకి మెదక్‌లో పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలేదా అని అన్నారు. జై తెలంగాణ అన్నవాళ్లను కాదని, రియల్ ఎస్టేట్ వాళ్లకి, సూట్‌కేసులు మోసే వాళ్లకి బీఆర్‌ఎస్ టికెట్లను అమ్ముకుంటుందని విమర్శించారు.
ప్రాజెక్టుల పేరు మీద 50 వేల ఎకరాల భూమిని గుంజుకున్న వారికి టికెట్ ఎలా ఇస్తారని ఆయన మండిపడ్డారు. చేతనైతే నిజమైన ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదని సెటైర్ వేశారు. సిద్దిపేట అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసినా మీ పాపం పోదని అన్నారు.