ఎండకాలం ప్రారంభంలోనే భానుడు భగభగ మంటున్నాడు. జనాలు బయటికి రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో శనివారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీచడం వల్ల వచ్చే అయిదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి.
సిద్దిపేట జిల్లాలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా కల్హేర్లో 38.7 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎండ వేడికి ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.