రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ కీలక విషయాలు బయటపడుతున్నాయి. ప్రణీత్ రావు వెనుక మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రణీత్ రావుకు ఆ మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా సర్వర్ పెట్టినట్లు అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మరో రెండు సర్వర్లు ఏర్పాటు గుర్తించగా.. అందులో వరంగల్‌తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక సర్వర్లు అన్ని బీఆర్ఎస్ నేత ఆదేశాలతో ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రణీత్ ఎవరో కూడా తెలియదు: ఎర్రబెల్లి
ఈ క్రమంలోనే ప్రణీత్ రావు వ్యవహారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్పందించారు. ప్రణీత్ రావు ఎవరు నాకు తెలియదన్నారు. ప్రణీత్ అమ్మమ్మ పర్వతగిరి అని, నా పేరు చెప్పాలని అధికారులు ఒత్తిడి తెప్పిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, వార్ రూమ్ అంటే ఏంటో నాకు తెలియదని ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్ గూడ జైలులో ఉంటున్న ప్రణీత్‌ను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించగా.. విచారణను ముమ్మరం చేశారు. ప్రణీత్‌తో పాటు ఓఏసీపీ సహా మరో ఇద్దరు అధికారులతో కూడిన బృందం ప్రత్యేకంగా ప్రశ్నిస్తోందని తెలుస్తోంది. రెండో రోజు విచారణలో భాగంగా ప్రణీత్ పలు కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. ఎస్ఐబీకి చెందిన పలు హార్డ్ డిస్క్ లను కట్టర్లతో కత్తిరించి, వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ బయటపెట్టాడు. దీంతో ప్రణీత్‌ను వికారాబాద్ అడవిలోకి తీసుకెళ్లి హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయగా.. అది ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలోనే విచారణ జరిగినట్లు తెలుస్తోంది.