హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని మల్లారెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది. తన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లిన మల్లారెడ్డి… అక్కడే కాంగ్రెస్ నాయకుడితో భేటీ అయ్యారు.
బెంగళూరులోని ఓ హోటళ్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చి వేసిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో వాటిని కూల్చేశారు.
మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఆయన కర్ణాటక నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తాను పార్టీ మారేది లేదని ఇటీవలే మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతలోనే బెంగళూరుకు వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.