లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 43 మంది అభ్యర్ధులతో మంగళవారం రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్దాన్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్ధులకు చోటు దక్కింది. తొలి జాబితాలో 36 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 79 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. రెండో జాబితాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్‌కు చింద్వారా నుంచి అభ్యర్ధిత్వం లభించగా రాజస్ధాన్ జలోర్ నుంచి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ రెండో జాబితాలో రాజస్ధాన్ నుంచి 10 మంది అభ్యర్ధులు ఖరారయ్యారు. టాంక్-సవోయి మాధాపూర్ నుంచి హరీష్ మీనాను కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాహుల్ కస్వన్ పేరు ఉండటం గమనార్హం.
