ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జీవో ఇస్తామని, పైరవీలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పధకంపై జీవో ఇస్తామన్నారు. అలాగే మొదటి విడతలో 4 లక్షల 56 వేల ఇండ్లను ఇస్తామని, అందుకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించమన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఓఆర్‌ఆర్ చుట్టూ 25 నుంచి 30 ఎకరాలలో మార్కెటింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
