త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్ స్థానానికి మాలోత్ కవిత పేర్లను ప్రకటించారు. ఆది, సోమవారాల్లో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో బీఆర్‌ఎస్ అధినేత వరుస సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలపై నేతలతో చర్చించి.. అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతల అభిప్రాయం మేరకు సమష్టి నిర్ణయంతో తొలి విడుదతలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలువబోతున్న అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పార్టీని వీడి వెళ్లే వారితో ఎలాంటి నష్టం లేదన్నారు. ఎన్టీఆర్ లాంటి నేతలకు రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని, మనమెంత.. మనకూ ఒడిదుడుకులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అప్పుడే వ్యతిరేకత మొదలైందన్నారు. ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.









