తెలంగాణలో మా ఉద్యోగాలు మాకు వస్తాయని యువత భావించారని, గత ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వివిధ శాఖల్లో ఎన్నికైన వారికి నియామక ప్రత్రాలను ఎల్బీస్టేడియంలో అందజేశారు. 26 జిల్లాలకు చెందిన 5, 192 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియం చరిత్రలో నిలిచిపోతుందని, ఇక్కడే ఇందిరమ్మ ప్రజాపాలనను ఆశీర్వాదించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారని, తెలంగాణ ఏర్పాటైన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబం కోసమే పని చేసిందని విమర్శించారు.
పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారు కాబట్టే అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. సామాజిక సృహ ఉంటే విద్యార్థులను తయారు చేయాలన్నారు. గత పాలకులు గురుకులాల్లో సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా నాకు ఇంగ్లీష్ రాదని కొందరు అవహేళన చేస్తున్నారని, చైనా, జపాన్ దేశాల్లో ఇంగ్లీష్ రాకున్న ప్రపంచంతో పోటీ పడుతున్నాయని వివరించారు. ఇంగ్లీష్ మాత్రమే అభివృద్ధికి ఆటంకం కాదన్నారు. గుంటూరు నుంచి గుడివాడలో చదివిన వాళ్లు కూడా ఇంగ్లీష్ రాదని హేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సర్కార్ బడిలో చదువుకునే సీఎం కుర్చీలో కూర్చున్నానని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ రాదనే పరిస్థితి ఉండొద్దని చెప్పారు. కేసీఆర్ పెంచుకునే బొచ్చు కుక్కకు ఉన్న విలువ పేద వాడికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సర్కార్ ఫామ్ హౌస్ మత్తులో నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఏ పరీక్ష పేపర్ ఏ జిరాక్స్ సెంటర్‌లో బయటపడుతుందో తెలియని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.









