ఊహించని ఘటనతో భయపడిన ఎమ్మెల్యేలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటన జనగాం దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు.. స్థానికంగా ఉన్న మెకానిక్‌ను పిలిపించి దగ్గరుండి టైర్ మార్పించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి చూస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం తర్వాత మరో బస్సులో ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బయల్దేరి వెళ్లారు.