పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎంపీలతో పాటు కొత్తవారికి ఎన్నికల బరిలో నిలిచేందుకు అవకాశం దక్కనుంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు ఆశావహుల పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్టానం పెద్దలు ఆచితూచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు. తాజాగా ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ పెద్దలు ఖరారు చేసినట్లు తెలిసింది. తొలి విడత జాబితాలో వీరి పేర్లను ప్రకటించనున్నారు. ఇవాళ సాయత్రం లేదా రేపు తొలివిడత జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
తొలి విడతలో బీజేపీ అధిష్టానం ప్రకటించే ఏడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ స్థానాలు మూడుతో పాటు, మరో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వీరిలో కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అరవింద్ (నిజామాబాద్), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), మాధవి లత (హైదరాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్) పేర్లు ఉన్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంట్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బరిలో దిగే అవకాశం ఉంది. అయితే, ఆయన పేరును సెకండ్ లిస్టులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మల్కాజిగిరి, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాలవైపు అందరిచూపు ఉంది. ఈ నియోజకవర్గాల నుంచి బీజేపీ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మల్కాగిజిగిరి నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్, మురళీధర్ రావు, మల్కా కొమురయ్య, వీరేంద్ర గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీబీ పాటిల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరుతారని, జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం.