మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఎదురుగా వచ్చే వాహనమో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యమో.. ఈ రోజుల్లో ఏది మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టపడే ఆహార పదార్థాలు కూడా అకాల మరణానికి కారణం కావచ్చు. తాజాగా వనపర్తి జిల్లాలో ఇలాగే ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి ఓ వ్యక్తి చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్య (39)కి బజ్జీలు అంటే చాలా ఇష్టం. బుధవారం సాయంత్రం ఇంటి ఎదుట కూర్చొని కోడిగుడ్డు బజ్జీలు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక తిరుపతయ్య కిందపడిపోయాడు. భర్త కిందపడిపోవడం గమనించిన భార్య సువర్ణ బజ్జీని తీసేందుకు ప్రయత్నించినా రాలేదు. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు వచ్చి గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీని తీశారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఊపిరాడక తిరుపతయ్య మృతి చెందాడు.