AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘జగన్ సిద్ధం అంటే.. మేం యుద్ధం అంటాం’

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామని, టీడీపీ జనసేన పార్టీల ప్రభుత్వం రాబోతుందని ధీమాను వ్యక్తం చేశారు. భీమవరం నియోజకవర్గ నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. టీడీపీ, జనసేన పార్టీల ప్రజా ఆశీర్వాదం ఉండాలన్నారు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ సిద్ధం అంటే.. మనం యుద్ధం అంటామని అన్నారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. మనుషులను విడగొట్టడం ఆయనలో ఉన్న విష సంస్కృతి అని, వివిధ కులాలు కొట్టుకు చావాలనేదే జగన్‌ నైజం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చాలా కష్టపడి రూ. వేల కోట్లు సంపాదించి పెడితే.. జగన్ తన చెల్లెలికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇద్దరు బిడ్డలకు వైఎస్ సమానంగా పంచి ఇస్తే.. అందులో చెల్లికి వాటా ఇవ్వలేదన్నారు. అది చాలా బాధ కలిగించే అంశం అని అన్నారు.

వైఎస్ షర్మిలకు సాక్షి పేపర్‌, భారతి సిమెంట్‌లో వాటాలు ఇవ్వనే లేదని ఆరోపించారు. సొంత చెల్లెలికే అన్యాయం చేసిన వాడు.. మనకేం చేస్తారని నిలదీశారు. తాను ఎవరినైనా నమ్మితే చిత్తశుద్ధితో పని చేస్తానని, అందరితో కలిసి ఉమ్మడి లక్ష్యం సాధించాలని కోరుకుంటామని అన్నారు. డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి ఉంటుందని అన్నారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకని, అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలని సూచించారు. తాము అధికారంలోకి వస్తే ఏ పథకాలు ఆపమని, అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఏ శక్తి అపలేదని అన్నారు. నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని, కనీసం భోజనాలైనా నేతలు పెట్టకపోతే ఏలా అని ప్రశ్నించారు. ఓటు చీలకుండా చేసే కసరత్తు కోసం తాను భీమావరంలో దూరంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ANN TOP 10