బీఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చేరిగారు. గురువారం ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మామ, అల్లుడు (కేసీఆర్, హరీష్ రావు) ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై బీఆర్‌ఎస్ నేతలు దృష్టి పెట్టలేదని చురకలు అంటించారు. వాళ్లు పదేళ్ల అధికారంలోకి ఉండి దోచుకుని.. దాచుకునేందుకు సమయం కేటాయించారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అంతులేని దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. పేక మేడల్లా మేడిగడ్డ కూలిపోతే సమాజానికి తెలియకుండా చేశారని తెలిపారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కడితే కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ అసెంబ్లీ రావడానికి నొప్పులు ఉంటాయి.. కానీ నల్గొండ వెళ్లడానికి ఎలాంటి నొప్పులు ఉండవని ఎద్దేవా చేశారు. పదేళ్లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, సీఎం కుర్చీలో నల్లమల నుంచి వచ్చిన రైతు బిడ్డ వచ్చి కూర్చుంటే కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. తాము ఉద్యోగాలు ఇచ్చినట్లు మీ కళ్లకు కనబడటం లేదా ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తులు చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన..
హరీష్ రావుకు అధికారం రావాలంటే ఆయన ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనని కౌంటర్ ఇచ్చారు. పదవి కోసం ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టారని, హరీష్ రావును ఔరంగజేబుతో పోల్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా కాలేదని, అప్పుడే శాపనార్థాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. సాగు నీటి చర్చిందామని కేసీఆర్‌ను అసెంబ్లీలోకి రా అంటే ఫామ్ హౌజ్‌లోదాక్కున్నాడని విమర్శించారు.









