నవరత్నాల పథకాలను ప్రజలకు చేరవేసే యువ సైన్యమే వాలంటీర్ వ్యవస్థ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా నగదు పురస్కారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదవాడి భవిష్యత్తును మార్చాలనే తపనతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. లంచం, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్న భావి లీడర్లే వాలంటీర్లు అని చెప్పారు. మీరు చేస్తున్నాది ఉద్యోగాలు కాదని, మీరంతా భావి లీడర్లు అని అన్నారు. ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరు నా వాళ్లే అని పేర్కొన్నారు.
వాలంటీర్లే మన సైన్యం.. వాలంటీర్లు కాబోయే లీడర్లు అంటూ వ్యాఖ్యానించారు. 55 నెలలు ప్రజా సేవ చేశామని, మరో రెండు నెలల్లో ఎన్నికలు.. యుద్ధానికి సిద్ధమా అని అడిగారు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల 50 మంది వాలంటీర్లు నా సైన్యామని చెప్పారు. మీ అన్న జగన్ ఏర్పాటు చేసిన ఈ సైన్యం ప్రజలకు, ప్రభుత్వానికి వారధి అని పేర్కొన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విజయానికి కారణం వాలంటీర్లే అని కొనియాడారు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో జన్మభూమి కమిటీలు వస్తాయన్నారు. జరగబోయేది జన్మభూమి కమిటీలకు, వాలంటీర్ల వ్యవస్థకు మధ్య యుద్దమని చెప్పారు.
జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే పనులు అయ్యేవని, కానీ వాలంటీర్లు లంచాలు లేకుండా పని చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అప్పట్లో 39 లక్షల మందికి 3 వేల రూపాయల పెన్షన్ ఇచ్చే వాళ్లని, అది కూడా లంచం తీసుకుని ముస్టి వేసినట్లు ఇచ్చేవాళ్లని మండిపడ్డారు. ఇప్పుడు 66 లక్షల మంది పెన్షన్లలకు రూ. 3 వేల పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. పేద వాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదని, జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం కామెంట్స్ చేశారు. నా పాలనకు వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. మీ సేవకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు.









