ఈ ఏడాదిలో ఐదుగురికి భారతరత్నఅవార్డులు
మరణానంతరం నలుగురికి అత్యున్నత పౌర పురస్కారం
ఇద్దరు మాజీ ప్రధానులు, ఓ శాస్త్రవేత్త ఎంపిక
దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మరో ముగ్గురు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ వెటరన్ నాయకుడు ఎల్కే అద్వాణీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్లకు ఈ ఏడాది భారతరత్నను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైనవారిలో ఎల్కే అద్వాణీ మాత్రమే జీవించి ఉన్నారు.
భారత్‌కు 9వ ప్రధానిగా పనిచేసిన తెలుగోడు, పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకూ ప్రధానిగా కొనసాగారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించిన ఘనత పీవీకే దక్కుతుంది. ఆయన హయాంలో తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలే ప్రస్తుతం దేశాన్ని సుస్థిరం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, పండితుడు, రాజనీతిజ్ఞుడైన పీవీ దేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషి మరువలేనివి. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది. దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది.









