AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో ఐఏఎస్‌‌ల బదిలీలు.. టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నవీన్‌ నికోలస్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళన కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా ఇటీవలే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు నిర్వహించే ఈ కమిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. టీఎస్ పీఎస్సీకి కొత్త సెక్రటరీని నియమించింది. ప్రస్తుతం పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్‌ను బదిలీ చేశారు. ఆమె ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్ నికోలస్‌ గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు.. గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు కూడా నిర్వహించారు.

అదే విధంగా టీఎస్పీఎస్సీతో పాటు పలు శాఖల్లోని అధికారులను కూడా తెలంగాణ ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసింది. అందులో భాగంగా ఐ అండ్ పీఆర్ (సమాచార పౌర సంబంధాల) శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం.హనుమంతరావు నియమించింది. అలాగే కె.అశోక్ రెడ్డిని ఉద్యానవన శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే వ్యవసాయ కమిషనర్ బి.గోపిని మత్స్యశాఖ కమిషనర్‌గా నియమించింది. క్రైస్తవ మైనార్టీ సంస్థ ఎండీ నిర్మల కాంతివెస్లీని.. స్త్రీ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా జి. ఫణీంద్రరెడ్డిని, ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా సీతాలక్ష్మిలను నియమించింది. జూ పార్కుల డైరెక్టర్‌గా ఉన్న వీఎస్ ఎన్ వీ ప్రసాద్‌ను పౌరసరఫరాల డైరెక్టర్ గా బదిలీ చేసింది.

ANN TOP 10